తెలంగాణ ఉద్యమంపై దీర్ఘ కవిత

సాధారణం

tg1

tg2

యువకవి “ఎం.వి. పట్వర్ధన్” తెలంగాణ ఉద్యమంపై రచించిన దీర్ఘ కవిత – “జనాంతర్గామి”. ఎంతో ప్రభావవంతంగా గుండెల్లో నాటుకొనేలా అల్లిన ఈ కావ్యంలో చాలా పంక్తులు విశేషంగా ఆకట్టుకొంటాయి –

“మంచిది నాయనా! ఉద్యమమే లేదని
వినోదించు! వినోదించు!
నీ సమస్త సామ్రాజ్యాన్ని
క్షిపణిలా పేల్చే దాకా!

ఇవాళ ఉద్యమానిది
ఒక తల కాదు – ఒక పోకడ కాదు-
వేయి పడగలు! వేల నడకలు!

మాకు తెలుసు మీరు చెప్పే దానిలో
ఒక్క వాస్తవమూ లేదని –
ఉద్యమాన్ని కించపరిచే సమయంలో
పాలిపోయిన మీ ముఖ కవళికలే సాక్షి!

నిజం మా స్వరం –
ఉద్యమం భాస్వరం!

మీ అనురాగ హస్తాలను
మేం మాత్రం కాదంటామా?
కలకాలం కలిసే ఉందాం –
వేరు కాపురం పెట్టుకొని!

ఇక్కడకు రావాలంటే
వీసాలేమీ అక్కర్లేదు –
కడుపు లోతులో
విషాలు లేకుంటే చాలు!

రెండయ్యేది రాష్ట్రమే తప్ప –
అనురాగం కాదు!
పరిపాలనా ప్రాంతమే తప్ప –
మమకారం కాదు!

తయారుగా ఉండండి
తప్పకుండా వేద్దాం –
మన తెలుగు తల్లికి మల్లెపూల దండ!
మా తెలంగాణ తల్లికి బంతిపూల దండ!”

మరికొన్ని గ్రంథం వెనుక పుటలో చూడవచ్చు –

– డా. ఆచార్య ఫణీంద్ర

tg3

వ్యాఖ్యానించండి