“హిడింబ”

సాధారణం

రెండేళ్ళ క్రితం ఒక కవి సమ్మేళనంలో కలుసుకొన్నప్పుడు కవి మిత్రులు రావికంటి వసునందన్ గారు నాతో – “ఒక రాక్షస స్త్రీని నాయికగా చేసి కావ్యాన్ని రచిస్తే .. పాఠకులు ఎలా రిసీవ్ చేసుకొంటారు?” అని ప్రశ్నించారు. “ఏ రాక్షసిని పట్టుకొన్నారు?” అన్నాను నేను నవ్వుతూ. “ఏ శూర్పణఖో .. లేక హిడింబో .. అనుకోండి” అని, కాసేపు మౌనం తరువాత .. “నేను మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను” అన్నారు. నేను కాస్త ఆలోచిస్తూ – “మెప్పించేలా వ్రాస్తే బాగానే ఉంటుంది” అన్నాను. వసునందన్ గారు కొంత సంతృప్తి చెంది “మెప్పించాలనే కదా ప్రయత్నం!” అన్నారు.

20160103_001220
కట్ చేస్తే … ఇటీవల వసునందన్ గారిచే విరచితమైన “హిడింబ” లఘు కావ్యాన్ని అందుకొని ఆశ్చర్యానందాలకు లోనయ్యాను. వసునందన్ గారు అన్నంత పని చేసి, రసజ్ఞులైన తెలుగు పద్యకావ్య ప్రేమికులను అలరించారు. మెప్పించారు.
లక్క ఇంటినుండి భీమసేనుడు సోదరులను, మాతను తప్పించే ఘట్టంతో ప్రారంభమయ్యే ఈ కావ్యంలో హిడింబాసుర, భీమసేనుల యుద్ధం .. హిడింబ, భీమసేనుల ప్రణయం, వివాహం, ఘటోత్కచ జననాది ఘట్టాలతో కడు రమ్యంగా సాగింది. ముఖ్యంగా హిడింబ, భీమసేనుల శృంగార సన్నివేశంలో కవి గారు చిలికించిన హాస్యం హృద్యంగా ఉంది. కవి మిత్రులు ఆచార్య రావికంటి వసునందన్ గారికి అభినందనలు!

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

“భూమి యింకా గుండ్రంగానే ఉంది”

సాధారణం

Navya Invit 2014

(Please Click on the above)

మా మిత్రుడు కథా రచయిత శ్రీ నల్ల భూమయ్య రచించిన “భూమి యింకా గుండ్రంగానే ఉంది” కథా సంపుటి ఆవిష్కరణ సభకు సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.

– డా. ఆచార్య ఫణీంద్ర

హృద్య కవితా సేద్యం

సాధారణం

సమకాలీన వచన కవితా రంగంలో కవయిత్రులలో అగ్రేసర స్థానంలో నిలిచిన విదుషీ మణి డా. చిల్లర భవానీ దేవి. ఇటీవల ఆమె వలువరించిన “రగిలిన క్షణాలు” కవితా సంపుటి ఆమె త్రిదశాబ్ది పర్యంత విశాల సాహితీ జీవనంలో వెలువడిన దశమ గ్రంథం. మొత్తం 78 కవితలతో పరిపుష్టం చేయబడిన ఈ కవితా సంపుటిలో చాల మంచి కవితలున్నాయి. వాటిలో అనేక హృద్య వాక్యాలున్నాయి. మానవ జీవితంలో … ముఖ్యంగా స్త్రీ జీవితంలో సున్నితమైన సన్నివేశాలలో కవయిత్రి వెలయించిన కవితాత్మక స్పందనలు ఈ గ్రంథంలో పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయి. మచ్చుకి ఈ క్రింద ఒక కవితను చూడండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

cb

cb2

cb3

cb1

చిలుకూరి వారు చిలికిన కవితలు

సాధారణం

pan1

pan2

pan3

“కన్నె పిల్లలు
కాలేజీకి
రోడ్డంతా వెన్నెల”

“ఈ బ్రిడ్జి
ఎప్పుడు పుట్టిందో గాని
చచ్చేదాకా
టోలు ఒలుస్తోంది”

“తల క్రింద
పుస్తకం
స్వప్నం జ్ఞానోదయం”

ఇలా ఒక యాభై (యాభై అంటే యాభైయే) మినీ కవితలతో ఈ గ్రంథాన్ని అందించారు కవి. కొన్ని హత్తుకొన్నాయి. మరిన్ని మంచి మినీ కవితలు వ్రాసి కనీసం ’వంద’ మార్కు తాకాలన్న తపన కనిపించ లేదు ఈ కవిలో. నిరంతర కవితా సాధన చేసే పరిస్థితులు బహుశః లేవేమో ఈ కవికి. ఈ గ్రంథాన్నే వెనుకకు త్రిప్పి, తిరుగవేసి చూస్తే “ఓ పన్నెండు కవితలు” అన్న మరో గ్రంథంగా మారిపోతుంది. (అటు నుండి సగం – ఒక గ్రంథం; ఇటు నుండి సగం ఒక గ్రంథం అన్న మాట!) రెండో గ్రంథం శీర్షికలో ఉన్న నిర్లక్ష్యమే  ఆ కవితలలోనూ కనిపిస్తుంది. పుస్తకాన్ని చూసాక- సత్తా ఉన్న కవే కాని, సాధన, నిబద్ధత తక్కువ అన్న భావన కలుగుతుంది.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రపంచీకరణపై కవితా సంపుటి

సాధారణం

nr1

nr2

ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో పతనమవుతున్న పల్లె జీవనాన్ని చూసి, మనసు క్షోభించి, కలమెత్తిన అభ్యుదయ కవి శ్రీ దామరపల్లి నర్సింహా రెడ్డి. “ప్రపంచీకరణతో మారిన పల్లెలు” అన్న పేరుతో ఈ కవి రచించిన కవితా సంపుటిలో సామ్రాజ్యవాద దురాగతాలు, ప్రపంచీకరణ దుష్ఫలితాలతోబాటు కాలుష్యం, భ్రూణ హత్యలు, కార్మికుల కడగండ్లు, స్త్రీ వివక్ష – ఇత్యాది సామాజికాంశాలపై; మాతృ ప్రేమ, బాల్యం, జీవకారుణ్యం వంటి సార్వజనీన విషయాలపై కవితలున్నాయి. 

ఈ సంపుటిలో

“ఊరు మారింది, తీరు మారింది 
ఉనికి కోల్పోయింది”

“నగరమంతా వ్యాపించే దుర్వాసన 
మురికి కూపం! ఎవ్వరి పాపం?”

“అందని సహాయం .. ఎదురు చూపలే!
ప్రభుత్వ చర్యలు కంటి తుడుపులే!”

“ఆడ పిల్ల పుడితే ఒక అమ్మ పుట్టినట్లు”

వంటి పంక్తులు ఆకట్టుకొంటాయి

– డా. ఆచార్య ఫణీంద్ర

మధుర పద్యకృతి “మాతృభూమి”

సాధారణం

mb1

 

ప్రఖ్యాత కవయిత్రి, “అభినవ మొల్ల” బిరుదాంచిత విదుషీమణి శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారిచే విరచిత సత్కృతి – “మాతృభూమి”. గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ దేవాలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర నేపథ్యంలో ఆ తురుష్క రాజును ఎదురొడ్డి మాతృభూమికై పోరాడిన వీరుడు “భీమదేవుడు” నాయకునిగా, పరమ శివ భక్తురాలు ఆ ఆలయ నర్తకి “చోళ” నాయికగా అల్లిన చారిత్రిక పద్య కావ్యం ఇది. ధారా రమ్యమైన పద్యాలలో అటు వీర రసాన్ని, ఇటు శృంగార రసాన్ని చక్కగా పోషించారు కవయిత్రి. 

మచ్చుకు రెండు పద్యాలను ఆస్వాదించండి –

1)

దారుల మోహరింప సరదారులు బారులు దీరి, దుర్గ ప్రా

కారములందు మేటి విలుకాండ్రు శరావళి నెక్కుపెట్టి, దు

ర్వార బలాఢ్యుడౌ యవన వల్లభు గుండెలు జీల్చి చెండ, గం

భీర మహార్ణవంబు వలె భీముని సైన్యము బొంగి పొర్లెడున్!

 

2)

గజ్జెలందు మ్రోయు కరుణార్ద్ర భావాల

కజ్జలంబు కనుల కరగి కారె  –

నులుకు పలుకు లేక యుర్వీధవుడు ప్రియ

సుదతి నృత్య గతుల జూచుచుండె!

 

పద్య కవితా ప్రియులకు పరమాన్నపు విందు ఈ మూడు వందల పై చిలుకు పద్యాల కృతి.

– డా. ఆచార్య ఫణీంద్ర

mb2

 

నగ్న ముని “విలోమ కథ”

సాధారణం

మనుష్యుల విశ్వాసాల బలహీనతను సొమ్ము చేసుకొనడానికి నాయకుడు ఒక అందమయిన అబద్ధాన్ని సృష్టించి, దానికి విశేష ప్రచారం కల్పించి, తద్వారా నిజమని భ్రమింపజేయడం – “ఆకాశ దేవర” కథ.

దీనిని గ్రంథకర్త “విలోమ కథ” అన్నారు. సమాజానికి ప్రమాదకారులైన వ్యక్తులను కథలలో, నవలలలో మనం ప్రతినాయకులుగా చూస్తుంటాం. కాని, ఆ ప్రతినాయక పాత్రనే నాయక పాత్రగా చేసి అల్లిన కథ – “విలోమ కథ”.

తెలుగు సాహిత్యంలో కొత్తేమో గాని, యూరోపియన్ సాహిత్యంలో ఇది ఒక ప్రత్యేక ప్రక్రియగా వర్ధిల్లుతున్నదే. అలాగే మన సినిమా వాళ్ళకు కూడా ఇది కొత్తేమీ కాదు. ఈ మధ్య వస్తున్న కొన్ని హిందీ సినిమాలు, తెలుగులో వచ్చిన “బిజినెస్ మేన్” సినిమా విలోమ కథలే.

nm1

 

nm2

 

 అయితే మన ప్రాచీన ఆలంకారికులు మాత్రం – నాయకుడు ఉదాత్తుడై ఉండాలని నిర్దేశించారు. బహుశః దీనికి కారణం – విలోమ కథానాయకుని ప్రభావంతో అక్రమ మార్గాలకు  ఆకర్షితులయ్యే బలహీనులు మరింత చెడిపోయి సమాజ వినాశకారులుగా మారే ప్రమాదముందని కావచ్చు. కాని యూరోపియన్ సాహిత్యకారులు ఇటువంటి ఆదర్శాలకు పోరు.

“కొయ్య గుర్రం” ఫేం – ప్రఖ్యాత కవి, దిగంబర కవిత్వోద్యమ దిగ్గజం – “నగ్న ముని” అత్యంత ప్రతిభావంతంగా విరచించిన ఈ గ్రంథం ఒక సంవత్సర కాలంలోనే మూడు ముద్రణలు పొందడం హర్షించ దగిన విషయం.

– డా. ఆచార్య ఫణీంద్ర