‘థ్రిల్లింగ్’ కథలు

సాధారణం

km1

km2

ఎప్పుడూ నవ్యంగా ఆలోచించడం – నవ్య సాహిత్యాన్ని సృజించడం – సాహిత్య లోక పరిధిని విస్తృతి చేయడం – ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ ఆశయం.

మన సాహిత్య విమర్శకులు సామాజిక సందేశం పేరిట మన సాహిత్య సృజనకు పరిమితులు విధించారన్న మురళీకృష్ణ గారి ఆక్షేపణ కొంత వరకు వాస్తవమే. దీనికి కారణం మన విమర్శకులలో అత్యధికులు ” కళ ప్రయోజనం కోసమే – ” అని నమ్మేవాళ్ళు కావడమే. ఆ ఆదర్శం కోసం చాల సార్లు కళా మూల్యాలతో కూడా రాజీపడడం మనం చూస్తుంటాం. ఉదాహరణకు గురజాడ వారి ” దేశమును ప్రేమించుమన్న! మంచి యన్నది పెంచుమన్న! ” అన్న గీతంలో కవిత్వం పాలెంత అంటే – మనకు మనమే ఆలోచనలో పడవలసిన పరిస్థితి!

కాని నిజమైన కళారాధకులు ” కళ కళ కోసమే ” అని నమ్ముతారు. రస సిద్ధిని ఆకాంక్షిస్తుంటారు. ’రసానందం’ విలువ తెలిసిన వారు ఈ విషయంలో రాజీ పడలేరు. అలాగే మనకున్న నవ రసాలలో కొన్నింటికే పరిమితమై రచనలు చేయాలన్న తలంపు కూడా సరైనది కాదని ఈ విషయాన్ని గ్రహించిన వారు అర్థం చేసుకోగలరు. అన్ని రకాల రసాలలో రచనలు చేసి రస సిద్ధిని సాధించడం విశాల దృక్పథం అనిపించుకొంటుంది. ఈ విషయంలో ఐరోపా సమాజం ముందుందని చెప్పాలి. అందుకే వారి సాహిత్యంలో కామెడీస్, ట్రాజడీస్, హారర్ స్టోరీస్, ఫిక్షన్స్ … ఇలా అన్ని రకాల రచనలు విస్తృతంగా వెలువడుతుంటాయి. పాఠకులు అన్ని రకాల రచనలను విశేషంగా ఆదరిస్తూ ఉంటారు. కాని మనలా మడి గట్టుకొని పరిమితులు విధించుకోరు. ఇదే  ఆవేదన కస్తూరి వారిలో కనిపిస్తుంది. (ఆయన ముందుమాటలోని కొంత భాగాన్ని క్రింద చదవండి.) ఆయన ఆవేదనలోని వాస్తవాన్ని అంగీకరించక తప్పదు.

మన ఆలంకారికులు భయానకాన్ని ఒక రసంగా ఎప్పుడో అంగీకరించారు. ఆ భయానక రసంలో వచ్చిన తొలి కథా సంపుటి ఇది. ఇందులోని ప్రతి కథ చదువుతుంటే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. రసజ్ఞులు అన్ని కథలను చదివి తీరాల్సిందే. తెలుగు కథా సాహిత్యంలో ఇలాంటి నవ్య ప్రయోగాలను చేస్తున్న మురళీకృష్ణ అభినందనీయులు!

– డా. ఆచార్య ఫణీంద్ర

 

km3

ఒక స్పందన »

  1. పింగుబ్యాకు: రాతలు-కోతలు » ఆ అరగంటచాలు పుస్తకం పై ఆచార్య ఫణీంద్ర సమీక్ష.

వ్యాఖ్యానించండి