పరిణయ తిలకం

సాధారణం

“పద్య కళా ప్రవీణ”, “కవి దిగ్గజ”,

“ఏకవాక్య కవితా పితామహ”
డా. ఆచార్య ఫణీంద్ర
(తెలుగు విశ్వవిద్యాలయ “కీర్తి పురస్కార” గృహీత)
ఫోన్ : 9959882963.
“శ్రీకరం”, 6-34/48/1, బాలాజీనగర్ కాలనీ,
దుబాయి బిల్డింగ్ ఎదురుగా,
దమ్మాయిగూడ, హైదరాబాద్ – 500083.
           ” పరిణయ తిలకం”
          —————————–
           కవిగా, కథకునిగా, విమర్శకునిగా, వ్యాస కర్తగా,  బహుముఖీనంగా దినదిన ప్రవర్ధమానమౌతున్న ప్రతిభా సంపన్నుడు – “కుంతి”. అది ఆయన కలం పేరు. ఔరస నామధేయం – “కౌండిన్య తిలక్”. ఆయన సంప్రదాయ శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుల సంజాతుడు. ఉగ్గుపాలతో తిరుప్పావై పాశురాలను సేవించి, నరనరాన చూడికొడుత్త నాచ్చియార్ తిరువడిగళ్ళ కైంకర్య దృక్పథాన్ని జీర్ణించుకొన్న ఈ కవిపై ఆ పిరాట్టి కరుణా కటాక్ష వీక్షణ వైభవం ప్రసరించిందేమో .. శ్రీ గోదా రంగనాధుల మహా పరిణయ ప్రబంధ రచన సంకల్పం కలిగి, ఆ కృతి నిర్మాణంలో తాను విశేషంగా సఫలీకృతుడయ్యాడు. అలనాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవ రాయలు రచించిన “ఆముక్త మాల్యద” కావ్య స్ఫూర్తితో, శ్రీమదాండాళ్ జనన, యౌవన, వైవాహికాది ఘట్టాలకు ప్రాధాన్యతనిస్తూ అల్లిన కమనీయ కృతి ఈ “మహా పరిణయం”. రాయల వారే కాదు .. సుమారు ఒక దశాబ్ద కాలం పూర్వం మహాకవి, విమర్శకులు “ఆచార్య కోవెల సంపత్కుమార”, ఇదే కథా వస్తువుతో “ఆముక్త” అనే లఘు ప్రబంధ రచన కావించారు.
            తిక్కన సోమయాజి సృజించిన “ఉత్తర రామాయణ” కావ్యాన్ని కంకంటి పాపరాజు పునఃసృష్టి చేస్తూ ..
“వరుసం దిక్కన యజ్వ నిర్వచన కావ్యంబై
                     తగం జేసె ‘ను
 త్తర రామాయణ’, మందు పై మరి
                     ప్రబంధం బూని నిర్మించు టే
 సరసత్వం బని ప్రాజుఞలార! నిరసించం
                     బోకుడీ! రాఘవే
 శ్వరు చారిత్రము లెంద రెన్ని గతులన్
                     వర్ణించినన్ గ్రాలదే!”
అన్నట్లుగా, ఆ జగన్మాత – “ఆముక్త మాల్యద” పరిణయ గాథను ఎంద రెన్ని రీతుల వర్ణించినా రుచిరం, రసాన్వితంగానే ఉంటుంది కదా!
              ఇక “తిలక్” (కుంతి) విరచిత  “మహా పరిణయాన్ని” తిలకిద్దాం.
             ఈ కృతికర్త తన ఉక్తిలో రక్తిని, భక్తిని సమర్థవంతంగా రంగరించగల శక్తి గలవాడు. కావ్యారంభంలో కవి శ్రీవిల్లిపుత్తూరు పడతుల దినచర్యల ప్రారంభ వివరాలను ఎంత సహజ రమణీయంగా వర్ణించాడో చూడండి.
“శుకపికములు జేయు సుఖ రవముల విని
    “తెలవారెనే!” యని దిగులుపడుచు –
పతి కౌగిలింతను, గత రాత్రి హాయిని
     పాన్పుపై లజ్జతో బడవిడియుచు –
పతిపాదముల ధూళి పాపిట దాల్చుచు,
     అక్షములకు పుస్తె లద్దుకొనుచు –
శ్రీరంగనాథుని చిత్తమందు తలచి
      నింగిలో వేల్పుకు వంగి మ్రొక్కి –
పావురములకు ధాన్యము, పసరములకు
గ్రాసమును గూర్చి, ముంగిలి కసువు నూడ్చి
ముగ్గులను బెట్టి, ఆ పురి పొలతు లెల్ల
వనములోని బావి కడకు జనుదు రంత!”
          ఈ కవి కలం అనేక వైవిధ్యభరిత వర్ణనలు చిలుకడంలో ఆరితేరిందన్న విషయం నిర్వివాదాంశం. గోదాదేవి బాల్యాన్ని వర్ణిస్తూ చెప్పిన ఈ పద్యం దానికి తార్కాణం.
“విష్ణుచిత్తుడనెడి కడలి వెడలినట్టి సిరియె తాను!
విష్ణుచిత్తుడనెడి నగము బెంచినట్టి గిరిజ తాను!
విష్ణుచిత్తుడనెడి వనము వెలసినట్టి తులసి తాను!
విష్ణుచిత్తుడనెడి  కల్పవృక్షం బిడు వరము తాను!”
            గోదా చరిత్రంలో పూలదండది కీలకమైన పాత్ర. అటువంటి పూలదండతో ఆమె సంభాషించినట్టుగా అల్లిన ఈ పద్యం కడు హృద్యం.
“ఓ పూలదండ! నీవే
నా పావనమైన ప్రేమ కాధారంబై,
ఆ పరమాత్మను జేర్చుము –
నీ పుణ్య చరిత నిరతము నిఖిలము నిలువన్!”
అంతే కాదు … నాయిక పూలదండతో చుట్టరికాన్ని కలుపుకొని, తన ప్రేమ సందేశాన్ని నాయకునికి చేరవేయుమని ప్రార్థించడం – కవి భావనా పటిమకు, ప్రతిభా గరిమకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ‘శుక సందేశం’, ‘మేఘ సందేశం’ కృతులవలె కృతికర్త ఈ కృతిని ‘పుష్ప హార సందేశం’గా మలచడం నిజంగా ప్రశంసనీయం. పూలదండతో నాయిక పలికిన ఈ పద్యం ఈ కృతికే ఆత్మ వంటిది –
“నేను, నీవు పుట్టిన దొక నేల లోన –
కాన తోబుట్టువగుదును నేను నీకు!
రాయబారి వగుచు ప్రేమ రాయబార
ము నడుపవలె నా ప్రేమను తనకు దెలుప!”
         కావ్యకర్త కథాకథనం ఈ కావ్యంలో ఆద్యంతం కమనీయంగా సాగి పాఠకుని కట్టిపడేస్తుంది. గోదాదేవి తలపులు, గోదా స్వప్నం, చెలికత్తెలతో మార్గశీర్ష వ్రతాచరణ, చెలి ‘త్రివళి’ స్వప్న వృత్తాంతం … వంటి కల్పనలు గ్రంథానికి వన్నె తెచ్చాయి. తృతీయాశ్వాసంలో కవి శాస్త్రోక్తంగా – కన్యాదానం, జీలకర్ర – బెల్లం, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాలు, విందు భోజనాలు, అప్పగింతలతో సహా … గోదా, రంగనాథుల ఈ మహా పరిణయాన్ని సంపూర్ణమైన తెలుగు వివాహంగా జరిపించాడు.
          ఒకచోట కవి – శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలను చిన్న పద్యంలో పొందుపరచడం ముదావహం.
“జలచరమై, కూర్మము, కో
రల కిటి,సింహము, వటువయి, రామునివై, కో
సల పతివై, కృష్ణుడవై,
అల బుద్ధునివై, కలికిగ యలరెద వీవే!”
          మనోహరంగా ఈ ‘మహా పరిణయ’ కార్యా(వ్యా)న్ని నిర్వహించిన  కవి వతంసుడు ‘కుంతి’పై, ఆయన కుటుంబ సభ్యులపై శ్రీమదాండాళు తల్లి, శ్రీరంగనాథుల విశేష కటాక్ష వైభవం వర్షించాలని ఆకాంక్షిస్తూ, ఆయన కలం నుండి మరిన్ని దివ్య, భవ్య, నవ్య కావ్యాలు జాలువారాలని దీవిస్తున్నాను.
తేది: 12/8/2017                సం ||
                                    ఆచార్య ఫణీంద్ర
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s