‘చేగొండి కథా కదంబం’

సాధారణం

ఇటీవల ఆవిష్కృతమైన “యువభారతి” ప్రచురణ – శ్రీ చేగొండి రామజోగయ్య గారు రచించిన “చేగొండి కథా కదంబం” గ్రంథానికి సంస్థ అధ్యక్షునిగా నే నందించిన ముందుమాటను చూడండి.
– డా. ఆచార్య ఫణీంద్ర

అధ్యక్షులు, “యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ

యువభారతి సరిక్రొత్త ప్రచురణ – “అమృత భారతి”

సాధారణం

ఈ భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా .. “యువభారతి” సంస్థ ఆనాటి ప్రసిద్ధ ప్రచురణ – “మహతి” కి కొనసాగింపుగా “అమృత భారతి” అనే గ్రంథాన్ని ప్రచురించి ఇటీవలే ఆవిష్కరించడం జరిగింది. గత ఏబదేండ్ల తెలుగు సాహిత్య ప్రస్థానం పై పదకొండు మంది లబ్ధ ప్రతిష్ఠులచే వ్రాయించిన వ్యాస సంకలనం ఇది. ఈ గ్రంథానికి నేను వ్రాసిన ముందుమాటను పరిశీలించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర
అధ్యక్షులు
“యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ

మరొకమారు .. ‘మహతీ’ నినాదం …

సాధారణం

“యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ సుప్రసిద్ధ ప్రచురణ – “మహతి” ఇటీవల మళ్ళీ పునర్ముద్రితమయింది. ఆ గ్రంథంలో సంస్థ అధ్యక్షునిగా నా ముందుమాటను ఆస్వాదించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర

తెలుగు తేజం – పి.వి. నరసింహారావు

సాధారణం

కవి మిత్రులు డా. వూసల రజనీ గంగాధర్ గారు ఇటీవల రచించిన “తెలుగు తేజం – పి.వి. నరసింహారావు” గ్రంథానికి నేనందించిన ముందుమాట :
– డా. ఆచార్య ఫణీంద్ర

“సరస్వతీ సాక్షాత్కారం” గ్రంథంలోని “నా మనసాయెనే!”

సాధారణం

“యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ తొలి ప్రచురణ – “సరస్వతీ సాక్షాత్కారం” గ్రంథంలోని “నా మనసాయెనే!” అన్న ఖండ కావ్యాన్ని ఆలకించండి.

గానం : డా. ఆచార్య ఫణీంద్ర
అధ్యక్షుడు, యువభారతి

“తెలుగు సొగసులు”

సాధారణం

“ఆకాశవాణి” పూర్వ కార్యక్రమ నిర్వహణాధికారి, ప్రముఖ కవి శ్రీ సుధామ గారు రచించిన “తెలుగు సొగసులు” (“యువభారతి” సంస్థ ప్రచురణ) గ్రంథానికి నేను అందించిన ముందుమాట :

– డా. ఆచార్య ఫణీంద్ర

దత్తాత్రేయ శర్మ గారి “పుస్తకపాణీ శతకము”

సాధారణం

మిత్రులు శ్రీ దత్తాత్రేయ శర్మ గారి “పుస్తకపాణీ శతకము” గ్రంథానికి నేనందించిన ముందుమాట :


~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
తెలుగు విశ్వవిద్యాలయ “కీర్తి పురస్కార” విజేత
అధ్యక్షులు, “యువ భారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ
(Ph.No. 9959882963).
తేది : 8/3/2020

పలుకులమ్మకు పద్య నీరాజనం
~~~~~~~~~~~~~~~~~~

శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు తెలుగు భాషా కోవిదులు, సాహిత్య కార్యక్రమ నిర్వహణా దక్షులు, వృత్తిరీత్యా నిబద్ధత గల అధ్యాపకులు, సత్కవి, సాహితీ రూపకాలలో మెప్పించగల స్ఫురద్రూపి, నటులు … వెరసి బహుముఖీన ప్రతిభా సంపన్నులు. మూడు దశాబ్దులుగా నాకు మంచి మిత్రులు. ఎన్నో ఏళ్ళుగా కవితా వ్యాసంగాన్ని సాగిస్తున్నా, ముద్రణకు నోచుకొంటున్న ఆయన మొదటి గ్రంథం – ఈ “పుస్తక పాణీ” శతకం.

“నీ వాలంబన మీ సృష్టికి” అంటూ, “శ్రీ లాలిత్య ఘన కళాకేళిగ భువనాళి నేలు గీర్వాణి”కి నమస్కరించి ఈ శతక రచనకు ఉపక్రమించారు దత్తాత్రేయ శర్మ గారు. “అనగా నక్షర మీవై, వినగా శ్రుతివాణివై, కవిత్వాకృతివై, కనగా వాజ్మాధురివై పొనరింతువు” అంటూ తన కలం నుండి పద్య మరంద ధారలను జాలువార్చారు.

ఈ శతక కృతి యావత్తూ శర్మ గారి భాషా ప్రాభవ వైభవం ప్రస్తరించింది.

“భాషావేషవు, బ్రాహ్మీ
యోషవు, చతుర చతురాననోదిత నిగమో
ద్ఘోషవు, భావోన్మేష సు
భూషాకృతి భాసమీవు పుస్తక పాణీ!”

వంటి పద్యాలలో ప్రదర్శించిన శబ్ద ప్రయోగ వైదుష్యం అందుకు నిదర్శనం.

“ఈక్షా రక్షిత మీ క్షితి
సాక్షిణి! త్ర్యక్షణ కటాక్షితాక్షయ సాక్షా
ద్దాక్షాయణి! కామాక్షీ!
మోక్షా కాంక్షిత సుగమ్య! పుస్తక పాణీ!”

“విధుభూషిత శుభ శీర్షా!
ప్రథితాఖిల వాగ్విమర్శ భాషా యోషా!
విధి వల్లభ! ఋతు సన్నిభ!
బుధ వదనాంచిత ప్రభాస! పుస్తక పాణీ!”

ఇట్లా అనేక పద్యాలలో దత్తాత్రేయ శర్మ గారి ప్రౌఢ సమాస చాలన పాటవం గోచరమవుతుంది.
ఇంతటి పాండితీ గరిమను ప్రదర్శించిన ఈ కవీంద్రుడు కొండొకచో పలు అచ్చ తెనుగు మాటలతో కూర్చిన పద్యాలను కూడ ఈ కృతిలో పొందుపరచి తన కత్తి వంటి కలానికి రెండు వైపులా పదునే అని నిరూపించారు.

“తెలిసిన వేవియు లేవను
తెలివిడి కలిగిన తెలియును తెలివెంతటిదో!
తెలిసియు తెలియని కలగా
పులగపు నటన బ్రతుకయ్యె పుస్తక పాణీ!”

అట్లాగే –

“నిచ్చలు, లచ్చియు, గౌరియు
నెచ్చెలులై నిన్ను గొలువ నిగమాకృతివై,
యచ్చపు రాణిగ కొలువై
ముచ్చట ముల్లోక మేలు పుస్తక పాణీ!” అన్న పద్యం కూడ అందుకు తార్కాణ.

ఈ కృతిలో కృతికర్త సరస్వతీ మాత స్వరూపాన్ని అనేక కళారూపాలలో దర్శించి ప్రస్తుతించారు.

“వాచిక, మాంగిక, మభినయ
రోచి ర్నాట్య కళ లన్ని రూపంబులలో
వాచవులూరగ జేతువు …” అంటూ నృత్య కళను,

“సరిగమపదనీ స్వరముల,
స్వర సాధనముల సుగాత్ర వాద్యములందున్
సరస వచో విలసనముల
మురిపెముతో నిలుతువంట ..” అంటూ సంగీత కళను,

“తెర మారును, కథ మారును,
పరిపరి విధముల తదుపరి పాత్రలు జేరున్ –
తరగని దెడతెగనిది కథ
మురిసెదవా మా నటనకు? ..” అంటూ నాటక కళను ప్రస్తావించారు. నాటక కళను పేర్కొన్న ఈ పద్యంలో మానవ జీవన నాటక

తాత్త్వికతను కూడ విశేషార్థంగా స్ఫురింప జేసారు కవి.

“ధారా, ధారణ, ధిషణయు,
దౌరంధర్యాశు పద్య ధైర్యోద్ధతియున్,
సారమయ భాష, సద్య:
పూరణగు వధాన కళవు …” అన్న మరొక పద్యం తెలుగు వారికే ప్రత్యేకమైన అవధాన కళకు నిర్వచనంగా భాసిల్లింది.

“ఏ మౌనము నిబిడ మహ
ద్వ్యోమావధి దాటి మ్రోయు నోంకారంబై –
యా మధుర నాద లహరుల్
భూమిని మంత్రాక్షరములు ..” అన్నది దత్తాత్రేయ శర్మ గారి పారమార్థిక భావనా పరిధిని చాటే పద్యం.

అమ్మ వారి విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తూ ఆయనంటారు –

“ఇరులన్నియు ముంగురులై
కరి మొయిళులు నీ కనులకు కాటుకలై శా
ర్వరులున్ తెలిమేని వలువ
పొరలై యొదిగి ప్రభలీనె పుస్తక పాణీ!”

ప్రధానంగా పారమార్థిక దృష్టితో సాగిన ఈ రచనలో అక్కడక్కడ సామాజిక స్పృహ కూడ తొంగి చూడడం గమనార్హం.

“భాషింతురు స్వోత్కర్షల –
ఘోషింతురు నీతులెన్నొ కోవిదులట్లున్ –
వేషము లన్ని యిల నుదర
పోషణమునకే గదమ్మ …” అన్న పద్యంలో నేటి సమాజిక స్థితిలోని వ్యంగ్యాన్ని,

“శ్రీ చక్రాకృతి యటులన్
పూచిన పూలన్ని పేర్చి, భువి హరివిల్లై
తోచు బతుకమ్మవగుచున్
బ్రోచెదవు వనితల నెపుడు ..” అంటూ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని వివరించారు.

“తెలుగు జనులంద రికపై
తెలుగుననే మాటలాడు తెలివిని గలుగన్
తెలుగే కనువెలుగుగ నగు
పులకించెడి రోజులిమ్ము పుస్తక పాణీ!” అన్న పద్యంలో కవి తన తెలుగు భాషాభిమానాన్ని చాటుకొన్నారు.

అట్లాగే శర్మగారు తమ శాబ్దిక భాండాగారంలో అక్కడక్కడ “దేవులాట”, “కాట గలియు” వంటి మాండలిక నుడికారాలకు కూడ స్థానం కల్పించడం పాఠకులను విశేషం ఆకర్షిస్తుంది. ఒకచోట దత్తాత్రేయ శర్మ గారు –

“నెట్టుకు రాగలిగెద నే
‌నట్టింటను, నలుగు రెదుట, నానా సభలన్!
పుట్టించితివమ్మా నను
పొట్టన్ నిండక్కరముల ..” అని ఆత్మ విశ్వాసంతో చెప్పుకొన్న మాట అక్షర సత్యం. అంతే కాదు. ఆయన ఆకాంక్ష –

“అధికముగా కోరుకొనను –
మధురోహల దేల – నాదు మనమున కొలువై
సుధలూరెడు కవనంబై
బుధ వంద్యుని జేయ చాలు! ..”

ఈ కృతికర్త కోరికను ఆ వాగీశ్వరి తప్పక తీరుస్తుందని నా విశ్వాసం.

పలికినది భక్తి శతకము –
పలికించిన దేవి భవ్య వాణీ మాతౌ!
పలుకుల తళుకుల పద్యాల్
పలికిన మా శర్మ గారు పడయుత కీర్తిన్!

అభినందనలతో –

‌ (సం/-)
ఆచార్య ఫణీంద్ర

గాంధీ మహాత్ముని సూక్తులు

సాధారణం

నేను “యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షునిగా బాధ్యతలను చేపట్టిన తరువాత పలు గ్రంథాలను ప్రచురించడం జరిగింది. వాటిలో మొదటిది – “గాంధీ మహాత్ముని సూక్తులు”. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా భావి తరాలకు ఆ మహనీయుని సూక్తులను అందించాలన్న సదాశయంతో లక్షా పదిహేడు వేల ప్రతులను ముద్రించి ప్రజా బాహుళ్యానికి పంపిణీ చేయాలన్న మా ప్రయత్నం సఫలీకృతం అయినందుకు సంతోషిస్తున్నాం.

– డా. ఆచార్య ఫణీంద్ర

ఈశ్వరమ్మ శతకం

సాధారణం

కవి, ప్రభుత్వోన్నత పాఠశాల (వరంగల్) ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమ్మోజు శ్రీధర్ గారు రచించిన “ఈశ్వరమ్మ శతకం” – నా ముందుమాట

– డా. ఆచార్య ఫణీంద్ర